: అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు కావాలన్నారు.. ఇప్పుడు ఏం ఇవ్వకపోయినా ఆనందిస్తారా?: రఘువీరా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌లేక‌పోతున్నారో చెబుతూ టీడీపీ, బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... హోదా అంశంలో ఈ ఇరు పార్టీల నేత‌లు ఏపీకి ద్రోహం చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌లే రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం అంతా బోగస్ అని ఆరోపించారు. హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని 14వ ఆర్థిక సంఘం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని, ఈ విష‌యాన్ని కమిషన్ సభ్యులే చెప్పార‌ని ఆయ‌న అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై త‌మ‌ పార్టీ తిరుప‌తి నుంచి రెఫరెండం ప్రారంభిస్తుంద‌ని రఘువీరా చెప్పారు. ప్రజా బ్యాలెట్ ద్వారా త‌మ పార్టీ నేత‌లు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి హైకోర్టు స్టే ఇచ్చిన అంశంలో ఆయ‌న స్పందిస్తూ.. ఈ విధానాన్ని తాము మొద‌టినుంచే ఖండిస్తున్నామ‌ని అన్నారు. ప‌లు జీవోలను తెచ్చి రైతులను వేధించడం ప‌ట్ల తాము పోరాడుతూనే ఉన్నామ‌ని అన్నారు. రాజ‌ధాని కోసం వేసే టెండర్లు పారదర్శకంగా ఉండాలని రఘువీరా డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కేర్కల్ కమిటీ వ్య‌తిరేకించింద‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణానికి కావల‌సిన నిధులపై గతంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ రూ.5 లక్షల కోట్లు కావాలన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం ఏం ఇవ్వకపోయినా ఆనందం వ్య‌క్తం చేస్తారా? అని ప్ర‌శ్నిచారు.

More Telugu News