: ఇన్వెస్టర్లకు చుక్కలు... బ్రెగ్జిట్ తరువాత భారత స్టాక్ మార్కెట్ అతిపెద్ద పతనం!

వచ్చే వారంలో సమావేశమయ్యే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అమెరికాలో వడ్డీ రేట్లను పెంచేందుకు నిర్ణయం తీసుకోనుందన్న ముందస్తు అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో భారత స్టాక్ మార్కెట్ 2 శాతం పడిపోయి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపుతోంది. ఆసియా మార్కెట్ల సరళి, జపాన్, చైనా మార్కెట్లలో అమ్మకాలు సెషన్ ప్రారంభంలోనే ప్రభావం చూపడంతో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 170 పాయింట్లు దిగజారింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనంటూ 'బ్రెగ్జిట్'కు అనుకూల ఫలితం వెలువడిన తరువాత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆపై నేటి పతనమే అత్యధికం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుతుందన్న విశ్లేషణల నేపథ్యంలోనే అమ్మకాల ఒత్తిడి అధికమైంది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 వేల కోట్లు) భారత మార్కెట్లోకి పెట్టుబడుల రూపంలో పెట్టారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయి గరిష్ఠాలకు కూడా దగ్గరయ్యాయి. నిఫ్టీ కీలకమైన 8,900 పాయింట్ల స్థాయిని కూడా దాటింది. ఈ సమయంలో యూఎస్ ఫెడ్ వడ్డీ సవరణ వార్తలు ఇన్వెస్టర్లను తిరిగి అమ్మకాలవైపు నడిపించాయి. ఈ ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 406 పాయింట్లు పడిపోయి 1.41 శాతం నష్టంతో 28,391 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 135 పాయింట్లు పడిపోయి 1.52 శాతం నష్టంతో 8,731 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో కేవలం 6 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.24 శాతం, స్మాల్ క్యాప్ 1.56 శాతం నష్టపోయాయి.

More Telugu News