: కావేరీ ఎఫెక్ట్: నటులపై అసభ్య వాఖ్యలు చేశాడని విద్యార్థిని చితకబాదిన యువకులు.. ఖండించిన నేతలు

బెంగళూరులో ఇంజినీరింగ్ చదువుతున్న తమిళ విద్యార్థి(22)పై కొందరు యువకులు దాడిచేయడాన్ని రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఖండించారు. దాడి అమానుషమని పేర్కొన్నారు. కావేరీ జల వివాదంపై కర్ణాటకలో జరిగిన ఆందోళనల్లో కన్నడ సినీ నటులు పాల్గొనడాన్ని విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో విద్యార్థి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు యువకులు విద్యార్థి చదువుతున్న కాలేజీలోనే శనివారం అతడిపై దాడిచేశారు. నేలపై ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాతోపాటు స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో వైరల్ అయింది. దీంతో స్పందించిన రాజకీయ నేతలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. హింస సమస్యకు పరిష్కారం కాదని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. విద్యార్థిపై దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఉంటున్న తమిళులకు భద్రత పెంచాలని కేంద్రమంత్రి రాధాకృష్ణన్, ఎండీఎంకే చీఫ్ వైగో తదితరులు కర్ణాటకను కోరారు. కోయంబత్తూరులో ఆదివారం జరిగిన కర్ణాటక సాహిత్య సమావేశాన్ని టీపీడీకే పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సమావేశాన్ని నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

More Telugu News