: అమెరికా గతిని మార్చేసిన ఆ 102 నిమిషాలు... పునరావలోకనం!

సరిగ్గా 15 సంవత్సరాల క్రితం... సెప్టెంబర్ 11వ తేదీ... అమెరికా గతిని, ఆలోచనా విధానాన్ని మార్చివేసిన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాను వణికించాలన్న అల్ ఖైదా వ్యూహం విజయవంతమైన వేళ, యూఎస్ ఆర్థిక శక్తికి ప్రతీకలైన ట్విన్ టవర్స్ కుప్పకూలిన వేళ, దాదాపు 3 వేల మంది మరణించిన సమయం... 102 నిమిషాల వ్యవధిలో అమెరికా మొత్తం మారిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై రెండు విమానాల దాడితో 2,753 మంది, పెంటగాన్ పై విమానం కూలి 184 మంది, ఉగ్రవాదులతో ప్రయాణికుల వీరోచిత పోరాటంతో పెన్సిల్వేనియాలో క్రాష్ అయిన విమానంలో 40 మంది ఈ ఘటనల్లో మరణించారు. పదిహేనేళ్ల నాటి ఉగ్రవాద పైశాచికత్వాన్ని మరోసారి గుర్తు చేసుకుంటే... ఉదయం 8:46 - తొలి విమానం ట్రేడ్ సెంటర్ ను ఢీకొంది: బోస్టన్ నుంచి లాస్ ఏంజిల్స్ కు ఐదుగురు ఉగ్రవాదులు సహా 92 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 767 విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తరపు టవర్ ను ఢీ కొంది. ఇది అమెరికాకు తొలి షాక్. ఉదయం 9:03 - రెండో టవర్ ను ఢీ కొన్న విమానం: బోస్టన్ నుంచి లాస్ ఏంజిల్స్ కు ప్రయాణమైన 65 మందితో కూడిన మరో బోయింగ్ 767 విమానం సౌత్ టవర్ ను ఢీకొంటూ పేలిపోయింది. ఉదయం 9:30 - బుష్ ప్రసంగం: ఈ చర్యలు ఉగ్రవాదుల పనేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఫ్లోరిడాలో ఉన్న తాను వెంటనే వాషింగ్టన్ వస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం 9:37 - పెంటగాన్ పై దాడి: వాషింగ్టన్ డ్యూల్స్ నుంచి లాస్ ఏంజిల్స్ కు ఐదుగురు ఉగ్రవాదులు సహా 64 మందితో బయలుదేరిన బోయింగ్ 757 విమానం పెంటగాన్ పరిసరాల్లో కూలింది. ఉదయం 9:42 - అన్ని విమానాలూ ల్యాండింగ్: గాల్లో ఉన్న అన్ని కమర్షియల్ విమానాలనూ తక్షణం ల్యాండింగ్ చేయాలని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9:59 - ట్రేడ్ సెంటర్ దక్షిణ టవర్ పేక మేడలా కూలింది: దాదాపు 56 నిమిషాల పాటు మంటల్లో ఉన్న టవర్ లోని పిల్లర్స్ లోని మెటల్ బీమ్స్ కరిగిపోయిన వేళ టవర్ కుప్పకూలింది. ఉదయం 10:03 - పెన్సిల్వేనియాలో విమానం క్రాష్: నలుగురు హైజాకర్లు సహా 44 మందితో నెవార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరిన బోయింగ్ 757 విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్ విల్లీలో కుప్పకూలింది. ఈ విమానంలో హైజాకర్లను నిలువరించేందుకు ప్రయాణికులు, విమానం సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించడంతో వారి లక్ష్యం నెరవేరలేదు. ఉదయం 10:28 - నార్త్ టవర్ కూలింది: తొలి విమానం ఢీకొన్న తరువాత గంటా 42 నిమిషాల పాటు మంటల్లో ఉన్న ఉత్తరపు టవర్ కుప్పకూలింది. మన్ హటన్ లోని చాలా ప్రాంతాలకు దుమ్మూ ధూళి వ్యాపించాయి. తమ దేశంపై జరిగిన ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న అమెరికా, ఆపై ఉగ్రవాదంపై పోరును పెంచి, ఆఫ్గనిస్థాన్ పై విరుచుకు పడింది. అల్ ఖైదా పేరును దాదాపు వినిపించకుండా చేయగలిగింది. కానీ, ఇప్పుడు ఐఎస్ఐఎస్ పేరిట మరోరూపంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.

More Telugu News