: ‘పద్మ’ అవార్డులు ఎవరికివ్వాలో ఇక ప్రజలే నిర్ణయిస్తారు.. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కేంద్రం

ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డు గ్రహీతలను ఇక ప్రజలే నిర్ణయిస్తారు. అర్హులను వారే నామినేట్ చేస్తారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సమాజానికి సేవలందించిన, విజయాలు సాధించి పెట్టిన వారి పేర్లను ఇక నుంచి ప్రజలే నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించింది. పైరవీలకు తావు లేకుండా, అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రప్రభుత్వాలు పద్మ పౌరపురస్కారాల కోసం సిఫార్సులు చేస్తూ అర్హుల పేర్లతో కూడిన జాబితాను పంపిస్తాయి. కేంద్రం తుది నిర్ణయం తీసుకుని భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. అయితే ఇక నుంచి ప్రతి భారతీయ పౌరుడూ నామినేషన్‌లో పాలుపంచుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం పేర్కొన్న విధంగా ఆన్‌లైన్‌లో అర్హుల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినేట్ చేసే వారు తమ ఆధార్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అర్హులు అనిపించిన వ్యక్తుల పేర్లను నామినేట్ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్‌కు ఈ నెల 15 చివరి తేదీ కాగా ఇప్పటికే 1700 నామినేషన్లు వచ్చాయి.

More Telugu News