: అందరూ విఫలమైతే రోడ్లపైకి రావాలని అనుకున్నాను... అభిమానులను ఇబ్బంది పెట్టకూడదనే..!: పవన్

రాష్ట్రంలో ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు, వీరంతా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుని వస్తారన్న భావనతోనే తాను రోడ్లపైకి రాలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ముందుకు దిగితే, అభిమానులంతా రోడ్లపైకి వస్తారని, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే చూస్తూ ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ కూడా హోదాను తెచ్చేందుకు కృషి చేస్తాయని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులుగా అది వారిపై ఉన్న బాధ్యతని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చానని పవన్ చెప్పాడు. అందరూ విఫలమైన తరువాత తాను రోడ్లపైకి రావాలని అనుకున్నానని ఆ సమయం వచ్చిందని చెప్పాడు. రేపటి బంద్ గురించి ప్రస్తావిస్తూ, దానిలో పాల్గొంటారా? వద్దా? అన్నది కార్యకర్తల ఇష్టమని చెప్పాడు. "మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చున్నది ఎవరు? పార్లమెంటులో కూర్చున్నది ఎవరు? పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటున్నది ఎవరు? వాళ్లని ధర్నాలు చేయమని చెప్పండి. వాళ్లను నిలదీయమని చెప్పండి. మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి. మీరు ఉద్యోగాలు చేయాలి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. బిడ్డలను బాగా చూసుకోవాలి. ధర్నాల్లో ఎందుకు దిగాలి? నేతల పప్పులు ఇక ఉడకవు. వారు పోరాటం చేయాల్సిందే. వారిని నిలదీయండి" అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు పవన్.

More Telugu News