: 15 చిన్న యూనిట్లుగా విడిపోనున్న ఇన్ఫోసిస్!

భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో ఉన్న ఇన్ఫోసిస్ 12 నుంచి 15 వరకూ చిన్న బిజినెస్ యూనిట్లుగా విడిపోనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో యూనిట్ కు 500 నుంచి 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,350 రూ నుంచి రూ. 4,400 కోట్లు) ఉండేలా ఈ యూనిట్లు ఉంటాయని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నాలుగు పెద్ద విభాగాలు ఇన్ఫోసిస్ లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవలు, బీమా విభాగం రూ. 20 వేల కోట్ల ఆదాయంతో సాగుతుండగా, రిటైల్ మరియు లైఫ్ సైన్సెస్ విభాగం రూ. 15,400 కోట్లతో, మాన్యుఫాక్చరింగ్ మరియు హై-టెక్నాలజీ విభాగం రూ. 14,700 కోట్లతో, ఎనర్జీ, కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్ విభాగం రూ. 12,700 కోట్ల ఆదాయంతో ఉన్నాయి. వీటికి సందీప్ దడ్లానీ, మోహిత్ జోషి, రాజేష్ కృష్ణమూర్తి, రవి కుమార్ లు అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలో సాగుతున్న యూనిట్లను ఒక్కొక్కటీ మూడు నుంచి నాలుగు యూనిట్లుగా విడగొట్టాలన్నది ఇన్ఫీ డైరెక్టర్ల ఆలోచన. అక్టోబర్ నాటికి పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ఇటీవలి త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా సీఈఓ విశాల్ సిక్కా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కంపెనీ నుంచి కస్టమర్ కు మధ్య ప్రస్తుతం ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ మేనేజర్, సీనియర్ డెలివరీ మేనేజర్, డెలివరీ హెడ్, సర్వీస్ ఆఫరింగ్ హెడ్ వంటి వివిధ లేయర్లుండగా, ఈ సంఖ్యను కూడా తగ్గించాలని సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News