: కేజ్రీవాల్‌కు మరో తలనొప్పి.. ‘ఆప్’ పంజాబ్ నేతపై లైంగిక ఆరోపణలు

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలో సెక్స్ ఆరోపణలు జోరుగా వినిపిస్తూ సీఎంకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీ మంత్రి ఒకరు సెక్స్ ఆరోపణల్లో చిక్కుకుని పార్టీ పరువును బజారుకీడ్చగా తాజాగా పంజాబ్‌లోనూ ఓ నేతపై ఇటువంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో పాగా వేయాలని భావిస్తున్న ఆప్‌కు ఇది ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఇంటి పనిమనిషిపై పార్టీ పరిశీలకుడు ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆ పార్టీ వలంటీర్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను మీడియాకు విడుదల చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అతడిపై చర్య తీసుకోవాల్సిన ఆప్ అధిష్ఠానం, దానిని మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తోందని సునమ్ పట్టణ ఆప్ యూత్ వింగ్ ఇన్‌చార్జి రవీందర్ సింగ్ ధిల్లాన్ ఆరోపించారు. ఈ విషయంలో డబ్బులు పెద్దమొత్తంలో చేతులు మారాయన్నారు. ఈ ఆరోపణలపై బుధవారం ఆప్ అధిష్ఠానం విచారణకు ఆదేశించింది. రవీందర్ సింగ్ మాట్లాడుతూ మొదట ఈ విషయాన్ని ఆప్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా పరిశీలకుడిని మరో ప్రాంతానికి బదిలీ చేశారు తప్ప అతడిపై చర్యలు తీసుకోలేదన్నారు.

More Telugu News