: ఇక రైళ్లలోనూ విమాన టికెట్ల పద్ధతి.. డిమాండ్‌ను బట్టి రేటు!

రేపటి నుంచి రాజధాని, శతాబ్ది, 'దురంతో' రైళ్లలో ప్రయాణించే వారు చేతి చమురు వదిలించుకోక తప్పదు. ఈ రైళ్లలో టికెట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. పౌరవిమానయాన రంగంలో అమలవుతున్న పద్ధతిని రైల్వేలోనూ అమలు చేయాలని భావించిన ఆ శాఖ రేపటి నుంచే దానిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఈ రైళ్లలోని సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్‌కార్ కోచ్‌లలోని మొత్తం సీట్లలో పది శాతం సీట్లను సాధారణ ధరకు విక్రయించగా తర్వాత ప్రతీ పదిశాతం సీట్ల ధరలను పదిశాతం చొప్పున పెంచుతూ పోతారు. ఫలితంగా సెకెండ్ ఏసీ చైర్ కార్ ధరలు 59 శాతం, థర్డ్ ఏసీ ధరలు 40 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలు, రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్, కేటరింగ్, సర్వీస్ చార్జీల్లో మాత్రం మార్పు లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి నడుస్తున్న 42 రాజధాని, 46 శతాబ్ది, 54 దురంతో రైళ్లలో రేపటి నుంచి(సెప్టెంబరు 9) నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దళారులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ సరికొత్త పద్ధతిని అమలులోకి తీసుకొస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

More Telugu News