: కోల్ కతా ఎయిర్ పోర్టుకు 'మానవ బాంబు' బెదిరింపు... ముమ్మర తనిఖీలు!

కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయానికి బాంబు ముప్పు ఉన్నట్టు మూడు ఫోన్ కాల్స్ రావడంతో అక్కడ భద్రతాధికారులు విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు. కోల్ కతాలోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ, అర్షద్ అనే వ్యక్తి మానవబాంబుగా మారి కోల్ కతా ఎయిర్ పోర్టును పేల్చేయనున్నాడని, దయచేసి స్పందించాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. అలాగే సదరు అర్షద్ ఫోన్ నెంబర్ ను కూడా ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చాడు. తరువాత కాసేపటికి మరో నెంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో ఎయిర్ పోర్టులో బాంబు పెట్టారని, కొద్దిసేపట్లో అది పేలిపోతుందని ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ఇంకొంతసేపటికి బిందానగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మూడో ఫోన్ కాల్ లో విమానాశ్రయంలోని కార్గో ఫ్లైట్ లో బాంబు పెట్టారని, అది ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరించాడు. అప్పటికే ఎయిర్ పోర్టును స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలను రంగంలోకి దించాయి. బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రతి వ్యక్తి బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఈ ఫోన్ కాల్స్ గౌహతీ సర్కిల్ నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

More Telugu News