: 90 శాతం స్టార్టప్ సంస్థలు అర్థంపర్థం లేనివే!: 'ఫ్యూచర్ గ్రూప్' బియానీ సంచలన వ్యాఖ్య

ఇండియాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్టార్టప్ కంపెనీల్లో 90 శాతం అర్థంపర్థం లేని ఆలోచనలతో వస్తున్నవేనని ఫ్యూచర్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిశోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ది ఎకానమిస్ట్ ఇండియా సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతుండగా, ఇందులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలను సృష్టించే వనరులేమీ కాదని ఆయన అన్నారు. గడచిన నాలుగేళ్లలో మొదలైన స్టార్టప్ సంస్థల ఆదాయం మొత్తం కలిపి కూడా రూ. 3,500 కోట్లు లేదని, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో విఫలమవుతున్నాయని అన్నారు. చాలా కంపెనీలు తమను తాము విక్రయించుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయే తప్ప భారీ వ్యాపారాలు, విస్తరణపై కన్నేసినవి అతి తక్కువ మాత్రమే ఉన్నాయని అన్నారు. దీర్ఘకాల లక్ష్యాలు లేకుండా నడుస్తున్న ఈ తరహా స్టార్టప్ ల వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనాలు తక్కువేనని అన్నారు. నిధుల కోసం 80 శాతం వాటాలను వెంచర్ కాపిటలిస్టులకు అప్పగించేస్తున్న ఔత్సాహికులు, కొంచెం పేరొస్తే దాన్ని మరో భారీ కంపెనీకి విక్రయించేందుకు ముందడుగు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము సైతం బిగ్ బజార్ ఆన్ లైన్ వర్షన్ ను ప్రారంభించి, అది లాభసాటి కాదని భావించి మూసివేశామని గుర్తు చేశారు.

More Telugu News