: కేంద్రం ముందు 9 డిమాండ్లు పెట్టిన ఏపీ!... అన్నిటికీ సానుకూలత వ్యక్తమైతేనే ఢిల్లీకి చంద్రబాబు!

ఏపీకి కేంద్రం స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ప్రకటిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో నేటి ఉదయం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ అత్యవసర భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మధ్యాహ్నం భోజనానంతరం మరోమారు భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటిదాకా ముగిసిన భేటీలో కేంద్రం ప్రకటన గురించిన వెలుగులోకి వచ్చిన అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీకి ఆహ్వానించిన విషయాన్ని కూడా చంద్రబాబు తన మంత్రివర్గ సహచరుల ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు నిధులు తదితర 9 అంశాలకు చెందిన డిమాండ్లను కేంద్రం ముందు పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. వీటన్నింటికీ కేంద్రం సానుకూలంగా స్పందిస్తేనే ఢిల్లీకి వెళతానని, లేని పక్షంలో వెంకయ్య ఆహ్వానాన్ని సున్నితంగానే తిరస్కరిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని నిన్న రాత్రే కేంద్రానికి కూడా స్పష్టంగా చెప్పినట్లు కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం జరగనున్న మలి విడత భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News