: తెలుగు రాష్ట్రాల జల జగడం మరింత జటిలం!... ఏపీ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనన్న హరీశ్ రావు!

కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న జల జగడం మరింత జటిలమైపోయింది. కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఈ వివాదానికి తెర తీయగా... ఇరు రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ముఖాముఖీ భేటీ నిర్వహిస్తే తప్పించి ఫలితం ఉండదని కేంద్రం భావిస్తోంది. నిన్న డిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని హరీశ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అధిక నీటిని వాడుకుంటున్న ఏపీ ప్రభుత్వం... తాను తక్కువ నీటినే వాడుకుంటున్నానని చెబుతోందన్నారు. దీనిని నిర్ధారిచేందుకు తెలంగాణ ఇంజినీర్లను ఆ ప్రాజెక్టు వద్దకు అనుమతించాలన్నారు. అదే సమయంలో ఏపీకి చెందిన ఇంజినీర్లను తమ ప్రాజెక్టుల వద్దకు అనుతించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరానని తెలిపారు.

More Telugu News