: సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై మండిపడుతున్న ఉపాధ్యాయులు.. కేసు నమోదు

వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాంగోపాల్ వర్మ ఈనెల 5న ట్విట్టర్‌లో చేసిన వరుస పోస్టింగులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘అన్‌హ్యాపీ టీచర్స్ డే’ అంటూ టీచర్స్ విస్కీ బాటిల్ పెట్టి ఆయన చేసిన పోస్టింగ్‌లు సర్వత్రా విమర్శలకు దారి తీశాయి. వర్మ పోస్టింగ్‌లు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ (ఆర్జేయూపీ) రాష్ట్రాధ్యక్షుడు టి.గోపాల్ పేర్కొన్నారు. అంతేకాదు వర్మపై ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీచర్స్ యూనియన్ అధికారిక మాసపత్రిక ఉపాధ్యాయ వాణి ఎడిటర్ ముకల అప్పారావు మాట్లాడుతూ టీచర్లను అవమానించిన డైరెక్టర్ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజయవాడ పోలీస్ కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్‌ను కోరినట్టు పేర్కొన్నారు. కాగా, వర్మపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వర్మ ఓ ట్వీట్‌లో ‘‘నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆలోచించానంతే. అందుకే నాకు నేనే హ్యాపీ టీచర్స్ డే చెప్పుకుంటున్నా. టీచర్లంటే నాకు అసహ్యం. క్లాసులకు డుమ్మాలు కొట్టి సినిమాలు చూసేవాడిని. అందుకే నేను ఫిల్మ్‌మేకర్‌ను కాగలిగా’’ అని పేర్కొన్నాడు. ‘‘టీచర్ల కంటే నాకు ఇంకా ఎక్కువ తెలుసని నిరూపితమైంది. నాకు చదువు చెప్పిన అందరి టీచర్ల కంటే నాకు బాగా తెలుసు’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘స్కూల్లో కామిక్ బుక్స్ చదువుతుంటే అంతరాయం కలిగించేవారు. అందుకే నాకు టీచర్లంటే అసహ్యం. ఉపాధ్యాయులు బలవంతంగా నాకు చదువు చెప్పడమే నా జీవితంలో అత్యంత చెడ్డ రోజులు’’ అని ఇంకో ట్వీట్‌లో వర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News