: అద్దాల మేడల్లో ఉండేవాళ్లు బయట వాళ్లపై రాళ్లు విసరకూడదు!: పాక్ లో భారత హై కమిషనర్ చురకలు

చైనా వేదికగా జరిగిన జీ20 దేశాల సదస్సులో చివరి రోజు పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లో పర్యటించనున్నారనే వార్తలు పాకిస్థాన్ లో కలకలం రేపుతున్నాయి. నవంబర్ లో పాకిస్థాన్ వేదికగా జరగనున్న సార్క్ సదస్సుకు మోదీ హాజరువుతారని పాకిస్థాన్ లో భారత హై కమిషనర్ గౌతమ్ బంబావాలే వెల్లడించినట్టు పాకిస్థాన్ పత్రికలు వార్తలు ప్రచురించాయి. కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ, భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, ప్రస్తుతం మోదీ ఇస్లామాబాద్ (సార్క్ సదస్సు) కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని మాత్రం చెప్పగలనని అన్నారు. అలాగే అద్దాల మేడల్లో ఉండే వాళ్లు బయట వున్న వారిపై రాళ్లు విసరకూడదని పాకిస్థాన్ కు హితవు పలికారు. ఇరు దేశాల్లో సమస్యలు ఉండవచ్చని, అంత మాత్రాన పక్క దేశాల్లోని గొడవల్లో తల దూర్చడం కంటే.. పాకిస్థాన్ ను చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. బలూచిస్థానీలు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖల్లోని అంశాలను మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 ప్రసంగంలో ప్రస్తావించారని అన్నారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య వ్యాపార, వాణిజ్యాలు మరింత పెరగాలని సూచించిన ఆయన, పాక్ వ్యాపారవేత్తలు భారత్ లో పర్యటించాలని కోరారు.

More Telugu News