: దుముకుతున్న బుల్స్... ఏడాదిన్నర తరువాత 8,900ను తాకిన నిఫ్టీ

దాదాపు అన్ని సెక్టార్ల ఈక్విటీల్లోనూ కనిపించిన కొనుగోలు మద్దతు మార్కెట్ బుల్స్ ను ముందుకు దూకించింది. దీంతో గతవారపు లాభాలను కొనసాగిస్తూ, నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 8,900 పాయింట్ల స్థాయిని దాదాపు ఏడాదిన్నర తరువాత తాకింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. చివరి గంట వ్యవధిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని ఈక్విటీల కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ భారీ లాభాలను నమోదు చేసింది. మూడు రోజుల సెలవుల అనంతరం మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 445.91 పాయింట్లు పెరిగి 1.56 శాతం లాభంతో 28,978.02 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 133.35 పాయింట్లు పెరిగి 1.51 శాతం లాభంతో 8,943.00 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.84 శాతం, స్మాల్ కాప్ 0.95 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 41 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, కోల్ ఇండియా, టీసీఎస్, టాటా పవర్, అల్ట్రాసిమెంట్స్, విప్రో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,956 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,622 కంపెనీలు లాభాలను, 1,128 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గత శుక్రవారం నాడు రూ. 1,11,08,054 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,12,43,301 కోట్లకు పెరిగింది.

More Telugu News