: ఒబామాపై మరోసారి 'బూతు' నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. లావోస్‌లో జరగనున్న దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సుకు ఒక్క రోజు ముందు రోడ్రిగో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై కలత చెందిన ఒబామా లావోస్‌ వార్షిక సదస్సుకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. మాదకద్రవ్యాల కారణంగా వేలాదిమంది చనిపోతుండడంపై ప్రచారం ప్రారంభించిన రోడ్రిగో మాట్లాడుతూ ఒబామాను వేశ్య కొడుకుగా అభివర్ణించారు. చైనాలోని జి-20 సదస్సులో పాల్గొని వచ్చిన ఒబామాకు ఈ విషయం తెలిసి కలత చెందారు. ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఇలా వ్యాఖ్యానించడంపై ఆ దేశ అధికారులతో మాట్లాడాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కాగా రోడ్రిగో విధానాలను ఒబామా తూర్పారపట్టడం వల్లే ఆయన ఒబామాపై నోరు పారేసుకున్నాడని తెలుస్తోంది. రోడ్రిగో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పోప్ ఫ్రాన్సిస్‌ను కూడా బూతులు తిట్టాడు.

More Telugu News