: నవ్యాంధ్రకు మద్యం కరవు తీరనుంది!... కొత్తగా 9 డిస్టిలరీల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ మద్యం కరవు కోరల్లో చిక్కుకుంది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మద్యం తయారీ కంపెనీలన్నీ రాష్ట్ర రాజధాని హోదాలోని హైదరాబాదు పరిసరాల్లోనే ఏర్పాటయ్యాయి. వెరసి రాష్ట్ర విభజన తర్వాత ఆ డిస్టిలరీలన్నీ తెలంగాణ పరిధిలోకే వెళ్లిపోయాయి. దీంతో నవ్యాంధ్రలో నికరంగా 14 డిస్టిలరీలు మాత్రమే మిగిలాయి. వీటి ద్వారా నెలకు 17 లక్షల కేసుల లిక్కర్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అయితే ఏపీలో లిక్కర్ డిమాండ్ మాత్రం నెలకు 27 లక్షల కేసులుగా ఉంది. వెరసి నెలకు 10 లక్షల కేసుల మద్యం కొరత ఆ రాష్ట్రంలో ఉంది. డిమాండ్ కు సరిపడా మద్యాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో 2014లో కొత్త డిస్టిలరీలు ఏర్పాటు చేస్తామంటూ 9 దరఖాస్తులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి ప్రభుత్వం కూడా అనుమతించింది. అయితే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకావడంతో వాటి ఏర్పాటు వాయిదా పడింది. తాజాగా ఆ న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఏపీ ఆబ్కారీ శాఖ... సదరు 9 దరఖాస్తుదారులకు డిస్టిలరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదిలా ఉంటే... ఇప్పటికే మద్యం తయారీ చేస్తున్న 14 డిస్టిలరీల్లో విస్తరణ కోసం 12 డిస్టిలరీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి త్వరలోనే 9 కొత్త డిస్టిలరీలు, 12 డిస్టిలరీల విస్తరణతో ఏపీలో మద్యం కరవు తీరిపోనుంది.

More Telugu News