: మోత్కుపల్లి వర్సెస్ ఆనందీబెన్!... తమిళనాడు గవర్నర్ గిరీపై ఆసక్తికర పోరు!

తెలుగు నేలకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన కొణిజేటి రోశయ్య తాజాగా ఖాళీ చేసిన తమిళనాడు గవర్నర్ గిరీపై ఆసక్తికర పోరు నెలకొంది. రోశయ్య స్థానంలో తెలుగు నేలకే చెందిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కేంద్రం తమిళనాడుకు తాత్కాలిక గవర్నర్ గా నియమించిన విషయం తెలిసిందే. నిన్న చెన్నైలో విద్యాసాగర్ రావు పదవీ బాధ్యతలు చేపట్టగా... రోశయ్యకు తమిళనాడు సీఎం జయలలిత ఘన వీడ్కోలు పలికారు. రోశయ్య ఖాళీ చేసిన తమిళనాడు గవర్నర్ పదవిలో కొత్త వ్యక్తిని నియమించే కసరత్తును కేంద్రం ప్రారంభించింది. తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేరును కేంద్రం దాదాపుగా ఖరారు చేసింది. అయితే ఇటీవలే గుజరాత్ సీఎం పదవిని స్వచ్ఛందంగా త్యజించిన ఆనందీబెన్ పటేల్ కూ గవర్నర్ గిరీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆమెను నియమించే దిశగా సర్కారు యోచిస్తోంది. అయితే తనకు తమిళనాడు గవర్నర్ పదవే కావాలంటూ ఆనందీబెన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం నుంచి సమాచారం అందుకున్న మోత్కుపల్లి... ఆనందీబెన్ పటేల్ డిమాండ్ విని డైలమాలో పడినట్లు తెలుస్తోంది. తెలుగు స్థానికతకు కాస్తంత దగ్గరగా ఉన్న తమిళనాడుకు గవర్నర్ గా వెళ్లేందుకు మోత్కుపల్లి ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆనందీబెన్ కూడా తమిళనాడు గవర్నర్ గిరీనే కోరడంతో బీజేపీ సర్కారు కూడా డైలమాలో పడినట్లు సమాచారం. చివరికి ఆ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి!

More Telugu News