: పొలంలో నిలబడి వేరుశనగ మొక్కలు చేతబట్టి.... మీడియాకు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు

నీటి చుక్క లేక ఎండిపోయేందుకు సిద్ధంగా ఉన్న వేరుశనగ మొక్కలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగా ప్రాణం పోశారు. గత వారం రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ ఎండిపోతున్న వేరుశనగ పైర్లను చూసి చలించిపోయారు. అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించారు. గుంటూరు జిల్లా నుంచి వాటర్ ట్యాంకర్లను, మహారాష్ట్ర నుంచి రెయిన్ గన్లను రప్పించారు. ఎండిపోతున్న వేరుశనగ మొక్కలపై నీటి జల్లులు కురిపించారు. ఇందుకోసం ఆయన ఐదారు రోజులుగా సీమ జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లా బయలుదేరే ముందు ధర్మవరంలో వేరుశనగ పంటను పరిశీలించేందుకు పొలంలోకి దిగారు. పొలంలోని రెండు మొక్కలను పీకి పంట ఏ మేరకు కాసిందని పరిశీలించారు. అదే సమయంలో పంటల పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్ ప్రతినిధి చంద్రబాబు వద్దకు వెళ్లారు. పంట చేలో నిలబడి, చేతిలో పట్టుకున్న వేరుశనగ మొక్కలను కిందపడేయకుండానే చంద్రబాబు సదరు ఛానెల్ ప్రతినిధికి లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

More Telugu News