: నా స్పీడ్ అందుకుని పనిచేయలేకపోతే వెళ్లిపోండి.. అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించిన చంద్రబాబు

‘రేపటి నుంచి మీరు చెప్పడం, నేను మాట్లాడటం ఉండదు’ అంటూ రాయలసీమ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు రాయలసీమ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం జరిగింది. ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి కావాల్సిందే. ఇంతవరకు కొంత మొహమాటంతో, మీపై చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటే దెబ్బతింటారని ఆగాను. నా స్పీడ్ అందుకుని పనిచేస్తే చేయండి, చేతకాకపోతే వెళ్లిపోండి’ అని హెచ్చరించారు. ప్రాజెక్టుల పరిస్థితులపై ఇంజనీర్ కంటే తానే ఎక్కువగా స్టడీ చేశానని, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయో తనకు తెలుసన్నారు. ఇంతగా సూచనలు చేస్తున్నా పనిచేయకపోతే ఎలా? అంటూ వారిపై మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ కొత్తవేమీ కాదన్నారు. ప్రాజెక్టుల పనులు జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఇంతకాలం సహించానని, తన సహనాన్ని పరీక్షించొద్దని చంద్రబాబు హెచ్చరించారు.

More Telugu News