: 400 మంది రాజీనామాతో గోవా ఆర్ఎస్ఎస్ లో ముసలం!

గోవా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ సుభాష్ వెలింగాకర్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వెలువడిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఆయన తొలగింపును నిరసిస్తూ, దాదాపు 400 మందికి పైగా వాలంటీర్లు ఆర్ఎస్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. గోవాలో మంచి పేరు, పలుకుబడి ఉన్న ఆర్ఎస్ఎస్ నేత సుభాష్ తొలగింపు తరువాత, గోవాలోని అన్ని జిల్లా యూనిట్ల ఆఫీస్ బేరర్లు, మిగిలిన యూనిట్లకు చెందిన వారంతా రాజీనామా చేశారు. కాగా, భారతీయ భాషా సురక్షా మంచ్ పేరిట ఓ సంస్థను నడుపుతున్న ఆయన, అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీకి కీలకమైన వ్యక్తి. అయినప్పటికీ, వచ్చే సంవత్సరంలో గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుందని వ్యాఖ్యానించి చిక్కులు కొని తెచ్చుకున్నారు. ఓ కొత్త రాజకీయ పార్టీ బీజేపీని ఓడించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేరును చెప్పకుండా వ్యాఖ్యానించడంతో ఆయనపై వేటు పడింది. ఇదిలావుండగా, సుభాష్ రాజకీయాల్లో కాలుమోపాలని భావిస్తున్నారని, సంఘ్ నేతగా రాజకీయ కార్యకలాపాలు చేయరాదు కాబట్టి విధుల నుంచి తొలగించామని ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య స్పష్టం చేశారు.

More Telugu News