: ఇంగ్లండ్ ఈ స్థాయిలో శివాలెత్తడం వెనుక కారణం అదేనా?

పాకిస్థాన్ తో జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు బ్యాట్స్ మన్ శివాలెత్తి 444 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని ఇంగ్లిష్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో అసలు ఇంగ్లిష్ జట్టు ఇంతలా చెలరేగిపోవడానికి కారణం ఏంటా? అని ఆరాతీయగా... ఒక కారణం కనిపిస్తోంది. అదే... తొలి టెస్టు ముగిసిన అనంతరం విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు ప్రవర్తన! ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన అనంతరం తమకు శిక్షణ ఇచ్చిన పాకిస్థాన్ ఆర్మీకి గౌరవ సూచకంగా మార్చ్ ఫాస్ట్ చేసిన పాక్ జట్టు శాల్యూట్ చేసి, గ్రౌండ్ లో సింబాలిక్ గా పుషప్స్ తీశారు. దీనిపై ప్రపంచం వ్యాప్తంగా విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. పలువురు మాజీలు పాక్ జట్టు తీరును విమర్శించారు. సైన్యం దగ్గర శిక్షణ తీసుకున్న పాక్ జట్టు సిగ్గుపడాలి... క్రీడాకారులు ప్రధమ బాధ్యత మంచి ప్రదర్శన చేయడం, దాని కోసం నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుని మరింత రాటుదేలడమని, అది మానేసి సైనికుల దగ్గర శిక్షణ తీసుకున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్ల తీరుపై ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆనాడే పాక్ జట్టుకు తగిన గుణపాఠం చెప్పాలని ఇంగ్లిష్ జట్టు నిర్ణయించుకుంది. దానికి ప్రతీకారంగా టెస్టు సిరీస్ లో వెనుకబడినా 2-2తో సిరీస్ ను సమం చేసి సత్తా చాటింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి, పాక్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అందులో భాగమే నిన్నటి మ్యాచ్ లో అలా వారు చెలరేగిపోవడం!

More Telugu News