: ‘కృష్ణా’, ‘కొండవీటి’ వరదలతో అమరావతికి ప్రమాదం... ఎన్‌జీటీలో వాదించిన పిటిషన్ల తరపు న్యాయవాదులు

కృష్ణానది, కొండవీటి వాగులకు వరదలొస్తే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఎన్‌జీటీలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది సంజయ్ పరేఖ్ తన వాదనలు వినిపిస్తూ కృష్ణా నది, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి ముప్పు తప్పదని వాదించారు. శివరామకృష్ణన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందన్న పరేఖ్ ఆ రెండింటికీ వరదలొస్తే రాజధానికి పెను ప్రమాదం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చేనెల 9కి వాయిదా వేసింది. మరోవైపు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని చేపట్టిందని ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ ఆరోపించారు. ఎన్‌జీటీ విచారణకు ఆమె కూడా హాజరయ్యారు.

More Telugu News