: 11వ తేదీ తర్వాత మారనున్న కాపు ఉద్యమ స్వరూపం.. దూకుడుగా ముందుకెళ్తామంటున్న ముద్రగడ

కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం చెప్పిన గడువు సమీపిస్తుండడంతో కాపు నేతలు మరోమారు ఉద్యమ బాట పడుతున్నారు. రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును కలిశారు. ఆయన నివాసంలో జరిగిన భేటీలో కాంగ్రెస్ నేత చిరంజీవి, పళ్లంరాజు, బొత్స సత్యానారాయణ, ఉమ్మారెడ్డి, వైసీపీ నేత అంబటి రాంబాబు తదితర కాపు నేతలు పాల్గొన్నారు. రిజర్వేషన్లను త్వరగా అమలు చేసే విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలన్న అంశాన్ని చర్చించారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు దూకుడుగా ముందుకు వెళ్తామని సమావేశం అనంతరం ముద్రగడ తెలిపారు. తూతూమంత్రంగా బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించడం కాకుండా కాస్త గట్టిగానే ఉద్యమించాలని కాపు నేతలు నిర్ణయించారు. కాపు ఉద్యోగులపై వివక్ష కొనసాగుతోందని భేటీలో పాల్గొన్న కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 11వ తేదీన రాజమండ్రిలో 13 జిల్లాల కాపు సంఘాల నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం రిజర్వేషన్ల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని కాపునేత ముద్రగడ తెలిపారు. ‘‘ప్రభుత్వం ఇస్తున్న హామీలనే అడుగుతున్నాం. దీంతో మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయం తేల్చకుండా ఏదోదో మాట్లాడడం సరికాదు. 11వ తేదీన మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఆందోళన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం’’ అని ముద్రగడ పేర్కొన్నారు. ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన ఒంటరి కాదని, కాపు సమాజం మొత్తం ఆయన వెంట నిలుస్తుందని అన్నారు.

More Telugu News