: కార్పొరేట్ తరహా క్రైం...అమ్మాయిలను అమ్మి వంద కోట్లు సంపాదించారు!

భారత్ లో నేర సామ్రాజ్యం కార్పొరేట్ కల్చర్ ను అందిపుచ్చుకుంటోంది. నేరాలు చేయడానికి కూడా ఉద్యోగులను నియమించుకుంటూ అరాచకాలు చేసే స్థాయికి నేరగాళ్లు ఎదిగిపోతున్నారు. నయీం పేరుతో ఈ నేరప్రవృత్తి వెనుక కార్పొరేట్ కల్చర్ ఉందని తెలుగు ప్రజలు తెలుసుకోగా, తాజాగా ఢిల్లీలో వ్యభిచార ముఠాను అరెస్టు చేసిన పోలీసులు... అమ్మాయిల అక్రమ రవాణా, వ్యభిచారం కార్పొరేట్ స్టైల్ లో జరగడం చూసి అవాక్కయ్యారు. వ్యభిచార రాకెట్ నడిపే హుస్సేన్ (50), సైరా భాను (45) లను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించారు. దీంతో ఈ దందా గురించిన ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అమ్మకాలు సాగించినట్టు గుర్తించారు. ఇలా అమ్మకాలు సాగించే వారిని ఈ ముఠా అసిస్టెంట్లుగా వ్యవహరించేది. వారు అమ్మాయిలను తీసుకొచ్చి, మేనేజర్లకు అమ్మేవారు. ఈ మేనేజర్లు వారిని నాయికలకు అప్పగించే వారు. ఈ నాయికలు అమ్మాయిలను హ్యాండిల్ చేసేవారు. వీరికి సైరా భాను జీతాలిచ్చి పోషించేది. వారు వీరిని అల్మరాల్లోనూ, షెల్ఫ్ లలోనూ, సొరంగాల్లోనూ దాచి ఉంచేవారు. ఈ సమయంలో విటుల వద్దకు వారే పంపేవారు. ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలు ఉండేవి. 50 వేల రూపాయలకు ఒక అమ్మాయిని కొనుగోలు చేసి, 2 లక్షల రూపాయలకు అమ్మేసేవారు. అమ్మాయి వయసు ఎంత తక్కువైతే అంత ఎక్కువ డబ్బుకు అమ్మేసేవారు. ఇలా వారు వంద కోట్ల రూపాయలు సంపాదించారంటే ఎంత మందిని కొనుగోలు చేసి, ఎంతమందిని అమ్మారో ఊహించవచ్చు. ఇవి ప్రాధమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి? వీరి వెనుక ఉన్న సిండికేట్ ఎవరు? వంటి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నేరప్రవృత్తి కార్పొరేట్ కల్చర్ రంగు పులుముకుంటుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News