: చెత్తకుండీలో దొరికిన ఒలింపిక్ గోల్డ్ మెడల్

1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో రోయింగ్ క్రీడలో స్వర్ణపతకం గెల్చుకున్న అమెరికన్ జో జాకొబి గత జూన్ లో దానిని పోగొట్టుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ లో గెలుచుకున్న స్వర్ణపతకాన్ని తన కారులోంచి ఎవరో దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని తన ఖాతా ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. ఇది జరిగిన రెండు నెలల తరువాత అట్లాంటాలో తన తండ్రితో కలిసి వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి కోల్ స్మిత్ ఓ చెత్త కుండీలో గోల్డ్ మెడల్ ను చూసింది. ఈ పతకం జో జాకొబిదేనని నిర్ధారించుకుని దానిని అతనికి అందేలా చేశారు కోల్ స్మిత్ కుటుంబ సభ్యులు. పతకం తనను చేరడంతో సంతోషించిన జాకొబి, కోల్ స్మిత్ గురించి తెలుసుకున్నాడు. దీంతో ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి, అమెను ప్రత్యేకంగా అభినందించాడు. దీంతో కోల్ స్మిత్ చేసిన మంచి పని స్కూలు యాజమాన్యం, స్నేహితులకు తెలిసింది. దీంతో అంతా ఆమెను అభినందించారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు అకస్మాత్తుగా తమ స్కూలుకి రావడంతో యాజమాన్యం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఈ సందర్భంగా తనను చేరిన స్వర్ణ పతకాన్ని పిల్లలకి జాకొబి చూపించాడు. స్కూలు యాజమాన్యంతోనూ, పిల్లలతో గడిపిన జాకొబి వారితో ఫోటోలు దిగి వారిని ఆనందంలో ముంచెత్తాడు.

More Telugu News