: స్నేహితుడని సీనియర్ ఇంటికి వెళ్తే... సామూహిక అత్యాచారం చేశారు!

ఢిల్లీలో మైనర్లు, మేజర్లు అన్న తేడా లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే తాజా ఘటన వివరాల్లోకి వెళ్తే... జామియానగర్‌ కు చెందిన పదహారేళ్ల బాలిక ఓ పాఠశాలలో చదువుతోంది. తన కన్నా ఏడాది సీనియర్‌ అయిన విద్యార్థిని స్నేహితుడిగా భావించి ఆగస్టు 11న అతని నివాసానికి వెళ్లింది. అదే అదనుగా భావించిన స్నేహితుడు, తన మిత్రులతో కలిసి ఆమెపై గ్యాంప్ రేప్ చేశారు. ఈ ఘనకార్యాన్ని వారంతా వీడియో కూడా తీశారు. అప్పటి నుంచి ఆమెకు నరకం చూపించారు. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని తాము పిలిచినప్పుడు రావాలని, చెప్పినట్టు వినాలని హుకుం జారీ చేశారు. లేకపోతే దానిని సోషల్ మీడియాలో పెడతామని భయపెట్టారు. ఆమెను ఢిల్లీలోని పలు నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌ చేసేవారు. అంతటితో ఆగని ఈ దుర్మార్గులు, తమ స్నేహితులకు కూడా ఆమెను అప్పగించడం ప్రారంభించారు. ఆగస్టు 25న ఆమె కళ్లకు గంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లగా పలువురు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకునే ఆమె తల్లి గత కొన్ని రోజులుగా కుమార్తె ఇంటికి ఆలస్యంగా రావడం, నీరసంగా ఉండడం గమనించి ప్రశ్నించింది. అయినా ఆమె జరిగిన ఘోరాన్ని తల్లితో చెప్పుకోలేకపోయింది. ఈ బాధను ఇంటి పక్కనున్న స్నేహితురాలితో పంచుకోవడంతో వారు బాలిక తల్లికి విషయం చెప్పారు. దీంతో బయటపడితే పరువు పోతుందని భావించి, వైద్యం చేయించేందుకు తాను పని చేసే ఓ ఇంటి యజమాని, హక్కుల కార్యకర్త అయిన ముషారఫ్ హుస్సేన్ ను డబ్బులు అడిగింది. మౌనంగా రోదిస్తున్న ఆమెను గమనించిన ఆయన అసలు ఏం జరిగింది? అని నిలదీశారు. దీంతో జరిగిన దారుణం వివరించగా ముందు పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అంటూ సూచించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు గ్యాంగ్‌ రేప్‌ జరిగిన విషయాన్ని నిర్ధారించారు. మైనర్ అయిన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత్యాచార వీడియో క్లిప్‌ ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News