: కానుకలతో నిండిన శ్రీవారి హుండీకి సీల్ వేయని అధికారులు.. మండిపడ్డ టీటీడీ చైర్మన్

కానుకలతో నిండిన శ్రీవారి హుండీకి సీల్ వేయకుండా టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన ఈరోజు వెలుగు చూసింది. తిరుమల ఆలయంలో కానుకలతో నిండిన ఒక హుండీని ఈరోజు ఉదయం 10.20 గంటలకు అక్కడి నుంచి తొలగించి కొత్త హుండీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తొలగించిన హుండీకి నిబంధనల ప్రకారం గట్టిగా తాడుతో కట్టి, అధికారిక సీల్ వేయాల్సి ఉంటుంది. కానీ, పురికొసతో హుండీని చుట్టేసి పక్కన పెట్టేశారు. కాగా, ఈరోజు ఉదయం 11.20 గంటలకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అక్కడికి వచ్చి వేరే హుండీలో కానుకలు సమర్పించుకున్న సందర్భంలో ఈ హుండీ ఉండటాన్ని ఆయన గమనించారు. ఈ విషయమై ఆయన మండిపడ్డారు. దీనపై విజిలెన్స్ విచారణకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆదేశించారు. కాగా, తిరుమల ఆలయంలో భక్తుల రద్దీని అనుసరించి 7 నుంచి 10 హుండీలు కానుకలతో నిండిపోతుంటాయి.

More Telugu News