: ఫేస్ బుక్ లో ఆవేదన వ్యక్తం చేసిన మరో కర్ణాటక మహిళా అధికారిణి

కర్ణాటకలో మంత్రి వేధిస్తున్నారంటూ బళ్లారి డీఎస్పీ అనితా షెనాయ్‌ పదవికి రాజీనామా చేసి రెండునెలలైనా గడవకముందే మరో మహిళా అధికారిణి కర్ణాటక పోలీసుశాఖపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. బళ్లారి పోలీసు స్టేషన్‌ లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా పనిచేస్తున్న గాయత్రి ఫర్హాన్‌ తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు మరోసారి సంచలనం రేపుతోంది. 'మహిళలను అధికారులుగా గుర్తించడం కష్టతరంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ మొదలైన నాటినుంచి నేను దీనిని స్వయంగా అనుభవిస్తున్నా. డిపార్ట్‌ మెంట్‌ లో మహిళలు ఎంత శ్రమించినా వారి పనితీరుకు పురుషులకు లభించినంత గుర్తింపు రావడం లేదు. డిపార్ట్‌ మెంట్‌ లో వారానికి ఏడు రోజులు, 24 గంటలూ పనిచేసినా అంతా వృథా అవుతోంది. డిపార్ట్‌ మెంట్‌ లో పరిస్థితులకు అలవాటు పడేందుకు నాకు ఏడేళ్లు పట్టింది. కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. కానీ అవి నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఎప్పుడూ పైకి కనిపించనీయలేదు. ఇప్పుడు నా సమర్థతపై నాలోనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా బ్యాచ్‌ డిపార్ట్‌ మెంట్‌ లో అడుగుపెట్టి సెప్టెంబర్‌ 1తో పన్నెండేళ్లు పూర్తికానుంది. ఇన్నేళ్లయినా జాబ్ శాటిసిఫేక్షన్ లేదు. సమాజంలోనూ, వృత్తిలోనూ మహిళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. 'చెయ్యి లేదా చావు' అన్న పరిస్థితి నెలకొంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రి ఫర్హాన్‌ ఫేస్ బుక్ లేఖ మరోసారి కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కనిపిస్తోంది. అయితే గతంలో డీఎస్పీ స్థాయి అధికారిణి ఆవేదన వ్యక్తం చేేయడానికి తోడు మంత్రిని సవాలు చేయడంతో మీడియాలో వార్తల్లో నిలిచారు.

More Telugu News