: నీటిలో తేలియాడే విమానాశ్రయం... లండన్‌లో ప్రత్యామ్నాయ ఎయిర్ పోర్టుల నిర్మాణం

ఇంత‌వ‌ర‌కు భూమిపై ఏర్పాటు చేసిన విమానాశ్ర‌యాల‌నే చూశాం. ఒకదాన్ని మించి మ‌రొక‌టి ఉండేలా పోటీలు ప‌డి అన్ని సౌక‌ర్యాల‌తో అత్యాధునిక టెక్నాల‌జీతో, స‌ర్వాంగ సుంద‌రంగా వాటిని తీర్చిదిద్దుకుంటూ వ‌స్తున్నారు. అయితే మ‌నిషి మ‌రో ముందడుగు వేయ‌నున్నాడు. ఇక‌పై మ‌నం నీటిలో తేలియాడే విమానాశ్ర‌యాన్ని చూడ‌వ‌చ్చు. విమాన ప్ర‌యాణాలు చేస్తోన్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతుండ‌డంతో విమానాశ్రయాలను విస్తరించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే వాటి కోసం చాలా భూమి అవ‌స‌రం ప‌డుతుంది. లండ‌న్‌లో కొత్త విమానాశ్ర‌యాల‌కు భూమి క‌ర‌వైపోతోన్న ప‌రిస్థితి ఉంది. జ‌నంతో కిక్కిరిసిపోతోన్న అటువంటి న‌గ‌రాల్లో విమానాశ్రయాల విస్తరణ క‌ష్టంగా మారింది. దీంతో నిపుణులు కొత్త ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. సముద్ర జలాల్లో విమానాశ్రయాలను నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముఖ్యంగా యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం నిర్మించిన‌ రన్‌వేలు చాలా చిన్నవిగా ఉన్నాయి. దీంతో అత్యాధునిక జెట్ సర్వీసులను నడిపేందుకు అవి స‌రిపోవ‌ట్లేదు. అయితే భారీ రన్‌వేలతో నౌకలపై ఉండే ర‌న్ వేల‌ను నిర్మిస్తే భారీగా నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయి. దీంతో నీటిలో తేలియాడే భారీ రన్‌వేలనే నిర్మించే ప‌నిలో ప‌డ్డారు. లండన్ నగరానికి 30 మైళ్ల దూరంలో వున్న థేమ్స్ ఎస్ట్యూరి (థేమ్స్ నది ఉత్తర సముద్రాన్ని కలిసే చోటు) వద్ద నీటిలో ఈ విమానాశ్ర‌యాన్ని నిర్మించ‌త‌ల‌పెట్టారు. ఈ ప్రాజెక్టును ప్రస్తుతం బోరిస్ ఐలాండ్ ప్రాజెక్ట్ అని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2014లో ఆగిపోయిన‌ ఈ ప్రాజెక్టు ప‌నులు ప్ర‌స్తుతం మళ్లీ మొద‌లుపెట్టారు. ఇటువంటి నిర్మాణాల గురించి 1930లోనే ‘పాప్యులర్ మెకానిక్స్’ మేగజైన్‌లో నిపుణులు ప్ర‌స్తావించారు. దీంతో ఎన్నో దేశాలు ఆ ప‌నులు మొద‌లు పెట్టాయి. కానీ వాటిల్లో ఒక్క‌టి కూడా పూర్తికాలేదు. 1992లో మ్యూనిచ్ ఈ నిర్మాణ ప్ర‌యోగం కూడా చేసింది. జ‌పాన్ కూడా 1995లో ఇటువంటి నిర్మాణం కోసం ‘టెక్నాలాజికల్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ మెగా ఫ్లోట్’ సంస్థను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసి, ప్రయోగాత్మకంగా వెయ్యి మీటర్ల రన్‌వేను నిర్మించి విజయం సాధించవచ్చని తేల్చింది. అయితే ప‌లు కార‌ణాల‌తో ఆ ప్రాజెక్టు మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. అనంత‌రం శాన్ డియాగోలోనూ నీటిపై తేలియాడే విమానాశ్ర‌య నిర్మాణ ప్ర‌యోగం జ‌రిగినా... భారీగా నిధులు అవ‌స‌రం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల సందేహాలతో మళ్లీ ర‌ద్దు చేసుకున్నారు. హాంకాంగ్ కూడా ఈ నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని చూసి మ‌ళ్లీ వెన‌క‌డుగు వేసింది. చివ‌రికిప్పుడు 2014 లో తాము ర‌ద్దు చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌ను పున‌రుద్ధ‌రించి, స‌మ‌ర్థంగా ప‌నిచేసి, నీటిలో తేలియాడే విమానాశ్ర‌య నిర్మాణం చేప‌డ‌తామ‌ని లండ‌న్ చెబుతోంది.

More Telugu News