: బుర్ఖినీ స్విమ్‌సూట్లపై నిషేధం చట్టవిరుద్ధమే.. తేల్చిచెప్పిన మంత్రి

ముస్లిం మహిళల స్విమ్మింగ్ కోసం రూపొందించిన బుర్ఖినీలపై నిషేధం విధిస్తూ ఫ్రెంచ్ మేయర్లు తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. విమర్శలకు ఏమాత్రం వెరవని మేయర్లు బుర్ఖినీలపై నిషేధాన్ని తొలగించబోమని తేల్చి చెప్పారు. అయితే స్వయంగా ఆ దేశ అంతర్గత శాఖామంత్రి బర్నార్డ్ కాజెనీవ్ దీనిని తప్పుబట్టారు. బుర్ఖినీలపై నిషేధం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఫ్రెంచ్ తీరప్రాంతంలోని 30 నగరాలు బుర్ఖినీ స్విమ్ సూట్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బుర్ఖినీలతో భద్రతకు ముప్పు పొంచి ఉందని భావిస్తూ మేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇతరులపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఫ్రెంచ్‌లోని అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు బుర్ఖినీల నిషేధంపై చట్టం చేసి దేశవ్యాప్తంగా దానిని అమలు చేయాలని ఇంకొందరు కోరుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమేదీ లేదని, అది చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముందని వివరించారు. దేశంలో ముస్లింలకు కూడా అన్ని హక్కులు ఉంటాయని, అందరు కలిసి మెలసి జీవించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా తీసుకుని ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచడం సరికాదని హితవు పలికారు.

More Telugu News