: జల జగడాలకు తెర!... ఉమా భారతి సమక్షంలో త్వరలో చంద్రబాబు, కేసీఆర్ ల భేటీ!

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నీటి వాటాలపై వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు కార్యరంగం సిద్ధం చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు మరింత ముదిరాయి. కేంద్రం జోక్యం చేసుకున్నా ఈ వివాదాలు సద్దుమణగలేదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమక్షంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావుల మధ్య ఢిల్లీలో విడతలవారీగా జరిగిన చర్చలు పెద్దగా ఫలితమివ్వకపోగా, మరింత పెరిగాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల జల జగడాలపై కేంద్ర జలనవరుల శాఖ మంత్రి ఉమా భారతి స్వయంగా దృష్టి సారించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం... ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలతోనే పరిష్కారం కాగలదని ఉమా భారతి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె రెండు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు సూచించారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి మధ్యవర్తిత్వం నెరపుతానంటూ ముందుకు రావడంతో ఈ కీలక భేటీకి ఇద్దరు సీఎంలు ఓకే చెప్పేశారట. దీంతో ఈ భేటీకి సంబంధించిన వేదిక, తేదీల ఖరారు కోసం ఉమా భారతి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఇరువురు సీఎంలను ఓ చోట కూర్చోబెట్టి వివాదాలకు చెక్ పెట్టాలని ఆమె కార్యరంగం సిద్ధం చేస్తున్నారట.

More Telugu News