: కశ్మీర్‌పై భారత్‌ను ఎండగట్టేందుకు 22 మంది ఎంపీలను నియమించిన షరీఫ్

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతోంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది ఎంపీలను దూతలుగా నియమించారు. వీరు 22 దేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతారు. కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లాక కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారంపై తానిచ్చిన వాగ్దానాన్ని ఐక్య రాజ్యసమితికి గుర్తుచేయనున్నట్టు షరీఫ్ తెలిపారు. ‘‘నేను నియమించిన ఈ ఎంపీలు కశ్మీర్ వివాదాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తారు. పాకిస్థాన్ బలం వీళ్లే’’ అని షరీఫ్ పేర్కొన్నారు. చర్చల కోసం పాక్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంతో దిక్కుతోచని పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. మోదీ బలూచిస్థాన్ ఊసెత్తడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాక్ అప్పటి నుంచి మాటల తూటాలతో భారత్‌పై విరుచుకుపడుతోంది. భారత్ బలూచిస్థాన్ అంశాన్ని లేవనెత్తడంతో కశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీలను దూతలుగా నియమించినట్టు తెలుస్తోంది. అంతేకాక వచ్చేనెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి భేటీలో అంతర్జాతీయ సమాజం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి వారి దృష్టిని ఆకర్షించేందుకు షరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

More Telugu News