: నాకు కులమతాలు అంటగడితే.. అరికాలి మంట నషాళానికి అంటుతుంది: పవన్ కల్యాణ్

పలువురు తనను టీడీపీ పక్షపాతినని ఆరోపిస్తున్నారని, అయితే తాను ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో తొత్తుని కాదని, అదే సమయంలో తాను ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు మాత్రం తొత్తునేనని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సినిమాలను ఏ రోజూ సీరియస్ గా తీసుకోలేదని ఆయన చెప్పారు. సినిమాలను పెద్దగా పట్టించుకోని తాను జీవితాన్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటానని అన్నారు. సినిమాలను అభిమానించే వారెవరూ వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. సినిమా నటులను సీరియస్ గా అభిమానించి క్షణికావేశాలతో జీవితాలు నాశనం చేసుకోకండని ఆయన పిలుపునిచ్చారు. సినీ నటులమైన తమ మధ్య మంచి వాతావరణం ఉందని, తామంతా చాలా స్నేహంగా ఉంటామని ఆయన చెప్పారు. కోలారులో తన అభిమాని, జనసేన కార్యకర్త రాయల్ వినోద్ హత్య అతని తల్లికి కడుపుకోతను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు చాలా బాధ అనిపించిందని ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె గుండె ధైర్యం ప్రదర్శించి, కుమారుడి కళ్లను దానం చేసిన గొప్ప మహిళ అని ఆమెను అభినందించారు. అభిమానులు, కార్యకర్తలు తనను చూసేందుకు లేదా తనతో మాట్లేందుకు వస్తే తనకు ఆనందమని పవన్ చెప్పారు. అయితే అలా వచ్చేవారంతా గుర్తుంచుకోవాల్సింది ఒకటుందని ఆయన చెప్పారు. అంతా క్షేమంగా రండి, క్షేమంగా వెళ్లండి అని ఆయన పిలుపునిచ్చారు. తాను సమస్యలు చూసి పారిపోయే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. నిజమైన సమస్య వస్తే నిలబడే వ్యక్తినని ఆయన అన్నారు. అమరావతి రైతు సమస్యల విషయంలో వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేశానని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ కూడా తనకు సహకరించిందని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీకి తనదైన సహాయం చేశానని ఆయన గుర్తు చేశారు. తాను చేసింది ఉడత సాయమా? 90 శాతమా? అన్నది పక్కన పెడితే, చాలా మంది సహాయం చేశారని ఆయన చెప్పారు. ఇక తాను రిస్క్ చేసి రాజకీయాల్లోకి వస్తే, తమ పనులు మానేసి కొందరు తనపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యతినిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉంటే ప్రజలకు అన్యాయం జరగకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపితే తనను, జనసేన కార్యకర్తలను చాలా మంది పొగిడారని ఆయన అన్నారు. ఆ తరువాత 'ప్రశ్నిస్తా'నని అనగానే తన చుట్టూ ఉన్నవారంతా తన కులం వాళ్లేనని అనడం మొదలు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు వచ్చిన ఇంత మంది అభిమానులది ఏ కులమో? ఏ మతమో? తనకు ఎలా తెలుస్తుందని ఆయన నిలదీశారు. తాను గతంలో టీడీపీ విధి విధానాలను రెండుసార్లే అడిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. తనను ప్రతి పార్టీవారు కులం పేరుతో విమర్శలు చేయడం మొదలు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కులమెక్కడుంది? అలాగే నాకు మతం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. తన కడుపున పుట్టిన కూతురు క్రిష్టియన్ అని, ఆమె రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ లో బాప్టిజం తీసుకుందని ఆయన తెలిపారు. తాను హిందువునని, అలాంటప్పుడు తనకు మతాల భేదం ఎక్కడుందని ఆయన చెప్పారు. తనకు కుల మతాలు అంటగడితే అరికాలి నుంచి నషాళానికి మంట ఎక్కుతుందని ఆయన తెలిపారు.

More Telugu News