: ఏపీ మంత్రిగా లోకేశ్... దసరాలోపే క్యాబినెట్ లోకి!

యువనేత నారా లోకేశ్ చంద్రబాబు మంత్రివర్గంలో చేరేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. లోకేశ్ చేరికపై ఇంతవరకూ వాయిదాలు వేస్తూ వచ్చిన చంద్రబాబు, నిన్న పలు చానళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, లోకేశ్ పై సానుకూలంగా వ్యాఖ్యానించారు. లోకేశ్ బాగా పనిచేస్తున్నాడని, మంచి అవకాశం ఇస్తే పైకొస్తాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో క్యాబినెట్ లో ఆయన చేరిక ఖాయమైపోయినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో లోకేశ్ కు పదవిని ఇవ్వాలని కుటుంబం నుంచి ఒత్తిడి కూడా పెరగడంతో చంద్రబాబు తలొగ్గినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఐటీ, మునిసిపల్ మంత్రిగా ఉండటం, శాఖలపై పట్టు పెంచుకుంటూ, తదుపరి తానే ముఖ్యమంత్రినన్న భావన కలిగిస్తుండటంతో, లోకేశ్ ను అలా తయారు చేయాలన్న వాదన చాలా రోజులుగా వినిపిస్తున్నప్పటికీ, చంద్రబాబు పక్కనబెట్టారు. పార్టీలో రెండో అధికార కేంద్రం ఉండటాన్ని ఎన్నడూ ఇష్టపడని చంద్రబాబు, లోకేశ్ విషయంలో మాత్రం ఒకింత మెట్టుదిగి, ఏది ఎప్పుడు జరగాలో, అప్పుడు జరుగుతుందని అన్నారు. నేరుగా పార్టీ కోసం పనిచేస్తున్న లోకేశ్, పెద్ద అవకాశం వస్తే, బాగా ఎదుగుతాడని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన క్యాబినెట్ చేరికను ఖరారు చేసినట్టేనని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం దసరాలోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉండటంతో, అప్పుడు లోకేశ్ చేరిక ఖాయంగా తెలుస్తోంది.

More Telugu News