: పరువు హత్య చేసి అంత్యక్రియలు... ఘటనను ముందుగానే ఊహించిన యువతి వీడియో మెసేజ్ తో దుర్మార్గం బట్టబయలు!

ఉత్తరప్రదేశ్ లో అనారోగ్యంతో తమ బిడ్డ మరణించిందని చెబుతూ హడావుడిగా అంత్యక్రియలు జరిపించిన కేసులో పోలీసులు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. ముంబైలో నివసిస్తున్న మృతురాలి కుటుంబీకులు ఆమెను పరువు హత్య చేసేందుకు బలవంతంగా యూపీలోని హత్రాస్ సమీపంలోని సోనీ గ్రామానికి రైల్లో తీసుకుపోతున్న వేళ, టాయ్ లెట్లోకి వెళ్లిన బాధితురాలు తన సెల్ ఫోన్లో వీడియో తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను మేజర్నని, ఓ యువకుడిని ప్రేమించానని, అందుకు తండ్రి, సోదరుడు, బంధువులు ఒప్పుకోకుండా తనను బలవంతంగా సొంతూరికి తీసుకువెళుతున్నారని వీడియోలో యువతి వాపోయింది. తనను చంపేందుకే తీసుకెళుతున్నారని, తాను చనిపోతే అందుకు వారిదే బాధ్యతని చెప్పింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కాగా, కేసు నమోదు చేసిన హత్రాస్ పోలీసులు పారిపోయిన ఆమె కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఎప్పుడు ఏ రైల్లో తీశారన్న విషయం తెలియరాలేదు. ఆమె గత శుక్రవారం నాడు మరణించగా, ఆ వెంటనే అంత్యక్రియలు పూర్తి చేశారని స్వగ్రామంలోని స్థానికులు తెలిపారు. ఆ వీడియోను మరెవరో చిత్రీకరించినట్టు తెలుస్తోందని, బహుశా రైల్లో ఆమెను కలిసిన ప్రియుడు ముందు జాగ్రత్తగా వీడియోను తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News