: అమెరికా అడ్డంకితో ఆగిన భారత్, రష్యా కంపెనీల డీల్!

సాధారణంగా రెండు కంపెనీల మధ్య విలీనం లేదా వాటాల విక్రయ ఒప్పందాలు కుదిరిన తరువాత, విలువ సరిగ్గా లెక్కించలేదనో, లేకుంటే మారిన పరిస్థితుల మీదట విలువ తగ్గిందనో చెబుతూ డీల్స్ ఆగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, రెండు దేశాలకు చెందిన కంపెనీల మధ్య డీల్ కుదిరిపోయి, మూడవదేశం రాజకీయ, ద్వైపాక్షిక కారణాలతో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడం చాలా అరుదు. ఇప్పుడు భారత్ కు చెందిన ఎస్సార్ ఆయిల్, రష్యాకు చెందిన రోస్ నెఫ్ట్ కంపెనీల మధ్య కుదిరిన డీల్ అదే దారిలో నడుస్తోంది. రూయా సోదరుల నేతృత్వంలో దాదాపు రూ. లక్ష కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న ఎస్సార్ ఆయిల్ సంస్థలో 49 శాతం వాటాలను రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రోజ్ నెఫ్ట్ కు విక్రయించాలని కుదుర్చుకున్న డీల్ కు అమెరికా మోకాలొడ్డింది. ఉక్రెయిన్ లో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, రష్యాపై అమెరికా కొన్ని ఆంక్షలను విధించింది. అందులో భాగంగా రష్యాకు చెందివుండి విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల పేర్లను పేర్కొంటూ, వాటితో డీల్స్ వద్దని తన మిత్ర దేశాలకు గత సంవత్సరంలో వర్తమానం పంపింది. ఆ కంపెనీల జాబితాలో రోజ్ నెఫ్ట్ కూడా ఉండటం ఇప్పుడు ఎస్సార్ ఆయిల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఆ కంపెనీలతో కుదుర్చుకునే డీల్స్ అమెరికా జాతీయ సెక్యూరిటీకి విఘాతం కలిగించేవని, వాషింగ్టన్ డీసీ విదేశీ విధాన నిబంధనలను అతిక్రమించినట్టేనని అమెరికా వాదిస్తోంది. ఇక రష్యా సంస్థతో డీల్ పై ముందుకు వెళితే, ఇబ్బందులు తప్పవని ఎస్సార్ ఆయిల్ భావిస్తోంది. ఇరాన్ తదితర దేశాల్లో ఎస్సార్ వ్యాపారాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే భారతీయ బ్యాంకులు ఎస్సార్ ఆయిల్ సంస్థకు రూ. 35 వేల కోట్ల రుణాలను ఇచ్చున్నాయి. అందుకు ప్రతిగా రూయా సోదరులకు చెందిన ప్రమోటర్ వాటాలను 17 శాతం తనఖాగా ఉంచుకున్నాయి. ఇక ఎస్సార్ ఆయిల్ విదేశీ కార్యకలాపాలపై అమెరికా ఆంక్షలు విధిస్తే, తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేకపోవచ్చన్న కోణంలో బ్యాంకులు ఆలోచిస్తున్నాయి. లండన్ కు చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ ఎస్సార్ మాతృసంస్థలో దాదాపు రూ. 14 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టివుంది. ఆ సంస్థ కూడా రష్యాతో డీల్ వద్దని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్సార్, రోజ్ నెఫ్ట్ మధ్య డీల్ నిలిచిపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

More Telugu News