: విజయవాడలో వీధికుక్కలకు ఘనంగా ఫేర్‌వెల్!

పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వివిధ ఘాట్లలో సంచరిస్తున్న వీధికుక్కలను పట్టుకుని బంధించిన మునిసిపల్ అధికారులు గురువారం వాటిని విడిచిపెట్టారు. విడిచిపెట్టే ముందు వాటికి ఘనంగా ఫేర్‌వెల్ ఏర్పాటు చేశారు. పెరుగన్నం, సాంబారన్నం, పాలు, అన్నం తదితర వాటిని ఆహారంగా పెట్టారు. మొత్తంగా 1,084 కుక్కలను పట్టుకున్న అధికారులు పుష్కరాలు జరిగే అన్ని రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకున్నారు. శునకాలకు ఆహారం కోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను కేటాయించారు. గోదావరి పుష్కరాల సంద్భరంగా 78 కుక్కకాట్ల కేసులు నమోదవడంతో అప్రమత్తమైన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్(వీఎంసీ) అధికారులు కృష్ణా పుష్కరాల్లో అటువంటి ఫిర్యాదులు రాకూడదని భావించారు. వివిధ ఘాట్లలో సంచరిస్తున్న కుక్కలను బంధించి అజిత్‌సింగ్ నగర్‌లో ఏర్పాటు చేసిన పెద్ద బోనులో వాటిని ఉంచారు. బంధించిన వాటిలో 528 శునకాలకు సంతానోత్పత్తి లేకుండా స్టెరిలైజ్ చేశారు. 556 కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి వదిలేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎక్సెల్ ప్లాంట్ ద్వారా పదివేల శునకాలకు స్టెరిలైజ్ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలోని అన్ని మునిసిపాలిటీల్లో శునకాలకు స్టెరిలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ‘యూఎల్‌బీ డాగ్ స్టెరిలైజేషన్ ఇన్ ఏపీ’’ అనే యాప్‌ను విడుదల చేసినట్టు యానిమల్ కేర్ ల్యాండ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్వీ శ్రీకాంత్ బాబు తెలిపారు.

More Telugu News