: ఇదిగో తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం... ఇక రాజీనామా చేస్తారా?: రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కొత్త సాక్ష్యాలను మీడియా ముందుకు తెచ్చారు. 2012లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 1975లో నాటి సీఎం జలగం వెంగళరావు మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గించేందుకు అంగీకరించకుండా 152 మీటర్లు ఉండేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెబుతూ, నాటి డీల్ పత్రాలను మీడియా ముందుకు తెచ్చారు. రెండు రాష్ట్రాల మధ్యా 152 మీటర్ల ప్రాజెక్టుకు, 160 టీఎంసీల నీటి వినియోగానికి ఒప్పందం కుదరగా, అటువంటిదేమీ లేదని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. నాటి అధికారులు ఎత్తు తగ్గించకుండా ఉంచేందుకు వాదించిన వాదనలు, అందుకు మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పని విషయం మినిట్స్ లో నమోదయ్యాయని, ఇప్పుడు కేసీఆర్ రాజీపడి తెలంగాణ వాసులకు తీరని ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. ఎత్తు తగ్గించి నీటిని ఎత్తిపోయడం వల్ల రూ. 50 వేల కోట్ల అదనపు ఖర్చుతో పాటు ఏటా విద్యుత్ నిమిత్తం రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని, ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తప్పును అంగీకరించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News