: వ్యాయామంపై ఇష్టం తల్లి గర్భంలో ఉండగానే ఏర్పడుతుందట!

చాలా మంది వ్యాయామాన్ని ఇష్టంగా మొదలు పెడతారు. మరికొందరు ఇష్టంగా మొదలు పెట్టినా దానిని కొనసాగించరు. అయితే వ్యాయామంపై ఈ ఇష్టం అనేది తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ పిల్లల ఆసుపత్రి వైద్యులు దీనిపై జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయని తెలిపారు. ప్రధానంగా గర్భంతో ఉన్న ఎలుకలపై చేసిన పరిశోధనల ద్వారా ఈ అంశాలను గుర్తించారు. ఎలుకలను రెండు జట్లుగా విభజించి, కొన్ని ఎలుకలను స్వేచ్చగా తిరగనిచ్చారు. మరో జట్టులోని ఎలుకలను బలవంతంగా నిర్బంధించారు. ఆ ఎలుకలు ప్రసవించిన తరువాత వాటి పిల్లల ప్రవర్తనను పరిశీలించారు. బోనులో స్వేచ్ఛగా తిరిగిన ఎలుకల పిల్లలు వేగంగా పరుగెత్తడం, స్పందించడం చేశాయని, నిర్బంధించిన ఎలుకలు ప్రసవించిన పిల్లలు స్తబ్ధుగా ఉన్నాయని అన్నారు. వీటిని అనుసరించి, గర్భవతులుగా ఉన్న తల్లులు ఉత్సాహంగా ఉంటే వారి పిల్లలు కూడా ఉత్సాహంగా ఉంటారని, తల్లులు స్తబ్ధుగా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారని వారు తెలిపారు.

More Telugu News