: రిలయన్స్ జియో 4జీ సిమ్ కోసం భారీగా క్యూ కడుతున్న యువత!

యాపిల్ ఫోన్లు విడుదలైన వేళ, స్మార్ట్ ఫోన్ స్టోర్ల ముందు కనిపించే క్యూ ఇప్పుడు రిలయన్స్ జియో సిమ్ కార్డులు అందించే స్టోర్ల ముందు కనిపిస్తోంది. భువనేశ్వర్ నుంచి అహ్మదాబాద్ వరకూ, లక్నో నుంచి మొహాలీ వరకూ, ఢిల్లీ నుంచి తిరువనంతపురం వరకూ అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో తెల్లవారుఝామున 2 గంటల నుంచి రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, డిజిటల్ ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్ల ముందు యువతీ యువకులు క్యూ కడుతూ ఉచిత జియో టెస్ట్ సిమ్ కోసం నిద్ర పోకుండా మేలుకొంటున్నారు. ఈ సిమ్ ను సంపాదిస్తే 3 నెలల పాటు 4జీ ఇంటర్నెట్, వాయిస్, వీడియో కాలింగ్ తదితర సదుపాయాలు ఉచితంగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే శాంసంగ్, ఎల్జీ, పానాసోనిక్, మైక్రోమ్యాక్స్, ఆసుస్, అల్కటెల్, లైఫ్ తదితర బ్రాండ్ల 4జీ మొబైల్స్ ఉంటే, వాటిల్లో జియో సిమ్ ను వాడుకునే అవకాశం ఉండటంతో సిమ్ కోసం భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ సిమ్ ఉంటే జియో ప్రీమియం యాప్స్ అయిన జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో డ్రైవ్, జియో సెక్యూరిటీ, జియో మనీ వంటివి ఉచితంగా 3 నెలలు వాడుకోవచ్చు. ఆఫర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్న యువత, ఓ మూడు నెలల హై స్పీడ్ ఇంటర్నెట్ ను వాడి చూద్దామని భావిస్తోంది. కాగా, ఈ సిమ్ పొందాలంటే, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని వెళ్లాల్సి వుంటుంది.

More Telugu News