: బ్యాటుతోనే కాదు... ట్వీటుతో కూడా ఇరగదీసిన సెహ్వాగ్!

క్రికెట్ మైదానంలో బ్యాటుతో ఇరగదీస్తుండే సెహ్వాగ్, ఈ దఫా సోషల్ మీడియా గ్రౌండ్ లో ట్వీట్లతో ఇరగదీశాడు. అలా ఇలా కాదు సుమా... బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలకు 130 కోట్ల మంది భారతీయులు ఫిదా అయిపోయే సమాధానాలు ఇచ్చాడు. ఇంతకీ ఈ ట్వీట్ల గొడవ ఏమిటంటారా... మరి చదవండి.. 'ఇండియా కేవలం 2 ఒలింపిక్ పతకాలు సాధించింది. దానికే ఇంత పెద్దఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు?' అని మోర్గాన్ వేసిన ప్రశ్న, ఇద్దరి మధ్యా మాటల యుద్ధానికి తెరతీయగా, సెహ్వాగ్ సమాధానానికి మోర్గాన్ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. మోర్గాన్ ప్రశ్నకు సమాధానంగా "ఇండియన్స్ చాలా చిన్న విషయాలకు సంబరాలు చేసుకుంటారు. క్రికెట్ ను కనుగొన్నామని చెప్పుకునే ఇంగ్లాండ్, ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. ఇంకా ఆడుతూనే ఉంది. ఇబ్బందిగా లేదా?" అన్నాడు. ఈ సమాధానానికి ట్విట్టర్ ఖాతాదారుల నుంచి భారీ స్పందనే వచ్చింది. గంటల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి. ఇక సెహ్వాగ్ ప్రశ్నకు మోర్గాన్ స్పందిస్తూ, "అవును ఇబ్బందిగానే ఉంది. మా దిగ్గజం కెవిన్ పీటర్ సన్ వరల్డ్ కప్ ఆడివుంటే గెలిచే వాళ్లమేమో. ఆయన ఆధ్వర్యంలో టీ-20 గెలిచాం" అన్నాడు. అప్పుడు పడింది సెహ్వాగ్ అసలు సిసలైన సిక్సర్. "కెవిన్ గొప్ప ఆటగాడే, డౌట్ లేదు. కానీ ఆయన ఇంగ్లండ్ లో పుట్టలేదు. సౌతాఫ్రికాలో పుట్టాడు. అయినా, నీ లాజిక్ నిజమైతే, 2007లో కెవిన్ ఆడిన వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ గెలిచుండాలి. అసలు నీకు మా ప్రజలు, వారి సెలబ్రేషన్స్ పై సమస్యేంటి?" అని ప్రశ్నించాడు. గత రాత్రి 8 గంటల తరువాత పెట్టిన ఈ ట్వీట్ వైరల్ కాగా, ఆపై మోర్గాన్ నుంచి సమాధానం కరవైంది. అంటే ఆయన సెహ్వాగ్ దెబ్బకు పలాయనం చిత్తగించినట్టేగా?

More Telugu News