: అక్కడ మందుతాగితే 'కొబ్బరికాయ' ఫైన్.. దీని వెనుక పెద్ద మర్మం ఉంది!

మందంటారు.. కొబ్బరికాయ అంటారు.. ఏంటిదంతా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. ఆ గ్రామంలో మందు తాగి పట్టుబడితే కొబ్బరికాయ జరిమానాగా వసూలు చేస్తారు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని మెయిన్‌గడి గ్రామంలో అమలవుతున్న వినూత్న జరిమానా ఇది. స్థానికంగా తయారవుతున్న మద్యాన్ని తాగుతున్న వారు ఉదయం నుంచి రాత్రి వరకు మత్తులో జోగుతున్నారు. ఇటీవల చిన్నారులు కూడా దీనికి బానిసయ్యారు. పనీపాట మాని అందరూ దీనికి బానిస అవడంతో స్పందించిన గ్రామ సర్పంచ్ సనిచరణ్ మింజ్(32) దీనికో పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. అందులోంచి వచ్చిందే కొబ్బరికాయ జరిమానా. ఇక నుంచి మద్యం తాగుతూ పట్టుబడిన వారు కొబ్బరికాయను జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. ఇది చాలా చిన్న జరిమానా అని, అయితే జరిమానా చెల్లించే సమయంలో వారు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుందని మింజ్ వివరించారు. దీంతో ఇకపై తాగే సాహసం చేయరని పేర్కొన్నారు. కానీ ఇలా పలుమార్లు పట్టుబడితే మాత్రం పోలీస్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామానికి కరెంటు సరఫరా లేకపోవడంతో వినోదం కరవైన యువకులు టైంపాస్ కోసం గ్రూపులుగా ఏర్పడి మద్యాన్ని సేవిస్తున్నారని, దీనికి చిన్నారులు కూడా జతకలుస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లడం మాని ఇదే పనిగా గడిపేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం మత్తులో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుండడంతో ఈ వినూత్న జరిమానాను తెరపైకి తీసుకొచ్చినట్టు గ్రాడ్యుయేట్ అయిన సర్పంచ్ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఇటీవల యువతతో మద్య నిషేధంపై ప్రతిజ్ఞ కూడా చేయించినట్టు ఆయన పేర్కొన్నారు.

More Telugu News