: తిరుమలలో అదనపు లడ్డూల కోసం భక్తుల ఆందోళన.. ల‌డ్డూలు సరిపడా లేవన్న అధికారులు

తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం అందించే అదనపు లడ్డు ప్రసాదాన్ని పొందేందుకు టోకెన్లను ఇవ్వడంలో తీవ్ర‌ ఆల‌స్యం చేయ‌డంతో ఈరోజు భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌డ్డుని పొందాలంటే ఆలయం పక్కనే ఉన్న టోకెన్ల కేంద్రం నుంచి భక్తులు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం నుంచి టోకెన్ల కోసం ఆ కేంద్రం బ‌య‌ట భ‌క్తులు క్యూకట్టారు. అయితే ఆ కేంద్రాన్ని సిబ్బంది ఎంత‌కీ తెర‌వ‌లేదు. దీంతో భ‌క్తులు గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్‌లోనే ఉండిపోయారు. చివ‌రికి ఆగ్ర‌హం తెచ్చుకున్న భ‌క్తులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఆలయ అధికారులు వెంటనే టోకెన్ కౌంట‌ర్ వద్దకు చేరుకొని భక్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. భక్తులు త‌మ‌కు ల‌డ్డు ప్ర‌సాదం కావాల్సిందే అన‌డంతో అప్ప‌టి వ‌ర‌కు క్యూలైన్‌లో వేచి ఉన్న భ‌క్తుల‌ను మాత్రమే టోకెన్ల కేంద్రంలోకి అనుమతించి టోకెన్లను ఇచ్చారు. త‌రువాత మ‌ళ్లీ టోకెన్ కౌంట‌ర్‌ని మూసేశారు. దీంతో క్యూలైన్‌లోకి కొత్త‌గా వ‌స్తోన్న భ‌క్తులు ల‌డ్డు పొంద‌లేక‌పోయారు. లడ్డూలు సరిపడా అందుబాటులో లేవ‌ని అందుకే టోకెన్లు ఇవ్వ‌డం లేద‌ని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News