: వరుడికి ఎయిడ్స్.. కలెక్టర్ జోక్యంతో ఆగిన పెళ్లి.. వధువు మెళ్లో మూడుముళ్లేసిన బంధువు

హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి ఆ విషయాన్ని దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి పీటలు ఎక్కేద్దామనుకున్నాడు. కానీ అతని పన్నాగం పారలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యానర్లే తన కొంపముంచాయని తెలుసుకున్న వరుడు ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇక వరుడి బాగోతం బట్టబయలు కావడంతో వధువు పెళ్లికి నిరాకరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి కుదిరింది. శనివారం వివాహం నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వారు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వరుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇవే వధువును అతడి బారి నుంచి రక్షించాయి. బ్యానర్లను చూసిన ఓ వ్యక్తి వెంటనే జిల్లా కలెక్టర్‌ ఎస్.పళనికి ఫోన్ చేసి మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని, వధువును రక్షించాలని కోరాడు. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్.పొన్ని, మెడికల్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్‌కు విషయాన్ని చేరవేశారు. వారు ప్రభుత్వ ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించి వరుడికి హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వివాహాన్ని ఆపాలని ఆదేశించారు. ఈలోగా తహశీల్దార్ వధువు చెల్లెలు ఫోన్ నంబరు కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఆమె ఆ విషయాన్ని కొట్టిపారేసింది. దీంతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి విషయం చెప్పారు. తమకు కొందరు ఈ విషయం గురించి ముందే చెప్పారని, అయితే పెళ్లి ఆపేందుకే వారలా చెబుతున్నారని భావించామని పేర్కొన్నారు. విషయం వధువుకు తెలియడంతో పెళ్లికి నిరాకరించింది. తమ కుమార్తె జీవితాన్ని కాపాడిన కలెక్టర్ ఇతర అధికారులకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాగా అదే రోజు వధువు తన బంధువైన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

More Telugu News