: రియో రికార్డులను దాటేసిన పుష్కర ‘అన్నదానం’!... వివరాలను ‘గిన్నిస్’కు పంపాలని చంద్రబాబు ఆదేశం!

కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు నిజంగా అమోఘమే. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చంద్రబాబు సర్కారు చేసిన ఏర్పాట్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పుష్కరాల కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థలు అన్నదానం ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ సహకారంతోనే ఆ సంస్థలు చేసిన అన్నదానం తాజాగా గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. ఈ మేరకు బెజవాడలో కొద్దిసేపటి క్రితం అధికారులతో మాట్లాడిన సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్కర అన్నదానం... రియో ఒలింపిక్స్ రికార్డులను బద్దలు కొట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్ లో రోజుకు కేవలం 50 వేల మందికి మాత్రమే భోజనాలు వడ్డించగా, పుష్కరాల్లో రోజుకు 1.5 లక్షల మందికి అన్నదానం చేయగలిగామన్నారు. ఇది ముమ్మాటికీ ప్రపంచ రికార్డేనని ఆయన అన్నారు. అన్నదానానికి సంబంధించిన అన్ని వివరాలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నిర్వాహకులకు పంపాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News