: మోదీ ‘చాయ్ పే చర్చా’ వేదిక అక్రమ నిర్మాణమే!... మూసేసిన అహ్మదాబాదు కార్పొరేషన్!

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ... ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పీఠం ఎక్కారు. మూడు దశాబ్దాల తర్వాత సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసన మోదీ చరిత్ర సృష్టించారు. అయినా నాడు బీజేపీకి అన్ని సీట్లు రావడానికి కారణం కూడా మనకు తెలిసిందే. అదే... మోదీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ రూపుదిద్దిన ‘చాయ్ పే చర్చా’. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో ‘ఇస్కాన్ గాంతియా టీ షాప్’ పేరిట వెలసిన ఓ టీ స్టాల్ కేంద్రంగా కొనసాగిన ఈ కార్యక్రమం దేశాన్ని మోదీ వైపు తిప్పేసింది. సదరు టీ స్టాల్ మరోమారు వార్తల్లోకెక్కింది. ఇస్కాన్ గాంతియా టీ షాప్ నకు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదట. సర్కారీ అనుమతి లేకుండానే వెలసిన సదరు టీ స్టాల్ కు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారట. దీంతో అక్కడ ట్రాఫిక్ కు ఆ టీ స్టాల్ వద్ద నిలుపుతున్న వాహనాలు పెను సమస్యగా మారాయి. దీంతో షాపు అనుమతులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలన్న అహ్మదాబాదు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ఆదేశాలకు యాజమాన్యం స్పందించలేదు. దీంతో సదరు షాపును అధికారులు మూసేశారు. వెరసి మోదీకి అధికారం దక్కడంలో కీలక భూమిక పోషించిన ఇస్కాన్ గాంతియా టీ షాపు రెండున్నరేళ్లు గడవకముందే మూతపడిపోయింది.

More Telugu News