: ఇండియాలో కాలుమోపిన చైనా ప్రభుత్వ హైస్పీడ్ రైళ్ల తయారీ సంస్థ

చైనా ప్రభుత్వ అధీనంలోని సీఆర్ఆర్సీ (చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్) భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. హైస్పీడ్ రైళ్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా గుర్తింపున్న సీఆర్ఆర్సీ, 64.4 మిలియన్ డాలర్ల విలువైన జాయింట్ వెంచర్ ను కేంద్రంతో కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మోదీ 'మేకిన్ ఇండియా' ఆలోచనను అమలు చేయడం ప్రారంభించిన తరువాత ఈ ఒప్పందం కుదరగా, హర్యానా కేంద్రంగా సీఆర్ఆర్సీ పయొనీర్ (ఇండియా) ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ పేరిట జాయింట్ వెంచర్ పనిచేయనుంది. ఈ వెంచర్ లో 51 శాతం వాటా చైనాదేనని ఆ దేశ ప్రభుత్వ న్యూస్ ఏజన్సీ 'జిన్హువా' వెల్లడించింది. ఇక్కడ రైల్వే హైస్పీడ్ రైల్వే ఇంజన్ల తయారీ, వాటి మరమ్మతు పనులు జరుగుతాయని పేర్కొంది. ఈ కేంద్రం నుంచి భారత రైల్వే వ్యవస్థకు సాంకేతిక సహాయాన్ని అందించనున్నామని, ఎలక్ట్రిక్ ట్రాన్స్ మిషన సిస్టమ్ లు, రైళ్లకే పవన విద్యుత్ యంత్రాల అమరిక, గనుల్లో వాడే వివిధ రకాల పరికరాల తయారీ కూడా ఈ ప్లాంటులో జరుగుతుందని వివరించింది. కాగా, భారత రైల్వేల్లో చైనా పెడుతున్న తొలి, భారీ పెట్టుబడి ఇదే. చైనాలో నడుస్తున్న రైల్వే యూనివర్శిటీ మాదిరిగానే, ఇండియాలోనూ ఓ వర్శిటీని ఏర్పాటు చేసేందుకు కూడా సీఆర్ఆర్సీ అంగీకరించిందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ యూ వీపింగ్ వెల్లడించారని 'జిన్హువా' పేర్కొంది. కాగా, సీఆర్ఆర్సీ సంస్థ 2007 నుంచి భారత రైల్వేలకు సహకారాన్ని అందిస్తోంది. పలు సబ్ వే ట్రయిన్లను, రైలింజన్లను, ఇతర రైల్వే వాహనాలను, విడి భాగాలనూ సరఫరా చేసింది. దాదాపు 60 వేల కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో ఒక ఇంజన్ తయారీ ప్లాంటు చాలదని భావిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని యూ వీపింగ్ తెలిపారు.

More Telugu News