: స్వార్థ ప్రయోజనాల కోసం రాళ్లు పట్టడం ఆపండి.. పెన్నులు, పుస్తకాలు చేతబట్టండి: కశ్మీర్ యువతకు రాజ్‌నాథ్ పిలుపు

కొందరి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కశ్మీరీ యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లు పట్టడం మాని పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు చేతపట్టాలని పిలుపునిచ్చారు. కశ్మీరీ యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు కొందరు పనిగట్టుకుని మరీ ప్రయత్నిస్తున్నారని, వారి మాయల్లో చిక్కుకోవద్దని సూచించారు. ‘‘కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లలు, యువతతో రాళ్లు పట్టిస్తున్నారు. ఇది వారి భవిష్యత్తుతో ఆడుకోవడం కాదా? అటువంటి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇకనైనా ఆ పనికి పుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నా. అమాయక ప్రజలతో రాళ్లు పట్టించే చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పండి’’ అని అన్నారు. చదువును పక్కనపెట్టి రాళ్లు పట్టుకోవాలని ఏ తండ్రీ తన పిల్లలకు చెప్పడని పేర్కొన్న రాజ్‌నాథ్, ఇకనైనా పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు పట్టుకోవాలని విద్యార్థులను కోరారు. లక్నో యూనివర్సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కశ్మీర్‌లో నెలకొన్న అన్ని పరిస్థితులకు చర్చల ద్వారా చక్కని పరిష్కారం కనుగొంటామన్నారు. ‘‘ఈ పిల్లలందరూ అమాయక భారత ప్రజలు. వారికేదైనా సమస్య కానీ కష్టం కానీ వచ్చినప్పుడు ఆందోళన ద్వారా పరిష్కరించుకోవాలనుకోవడం సరికాదు. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది’’ అని స్పష్టం చేశారు.

More Telugu News